Wednesday, 25 October 2017

PunnamiApTourism




Contact No : 
9493365888, 9493375888

ఎటు చూసినా గోదావరి గలగలలు... కనుచూపు మేర పరచుకున్న పచ్చని ప్రకృతి తివాచీ. కొండల నడుమ అందమైన సూర్యోదయం, అరుణ వర్ణంతో ఆహ్లాదింపజేసే సూర్యాస్తమయం. రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస. మధ్యలో క్యాంప్‌ఫైర్‌... గిరిజనుల నృత్యాలు, వారు రూపొందించిన సృజనాత్మక వస్తువులు....ఇలా ఎన్నో ప్రత్యేకతలు పాపికొండల పర్యటనలో అడుగడుగునా మనల్ని పలకరిస్తాయి. గోదావరి నదిలో పాపికొండల నడుమ పడవ ప్రయాణంలో పొందే ఆనందానుభూతి ఇంకెక్కడా దొరకదేమో?! ప్రకృతి సహజ సౌందర్యానికి నెలవైన 'పాపి కొండల' విశేషాలు........

ఉదయం ఏడున్నర గంటలకే రాజమండ్రిలోని లాంచీల రేవు దగ్గరకు చేరుకున్నాం. అక్కడ ఉన్న ట్రావెల్స్‌ బస్‌లో బయలుదేరి, తొమ్మిది గంటలకు పట్టిసం గ్రామాన్ని చేరుకున్నాం. అప్పటికే పట్టిసం రేవులో లాంచీలు సిద్ధంగా ఉన్నాయి. ముందుగానే రిజర్వు చేసుకున్న లాంచీలో ఎక్కి కూర్చొన్నాం. పది నిముషాల తర్వాత పడవ బయలుదేరింది. వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంది. పడవలో ట్రావెల్‌ ఏజెన్సీ ఏర్పాటు చేసిన గైడు ముందుగా ఆందరినీ పరిచయం చేసుకుంటూ మైకులో మేం చూడబోయే ప్రదేశాల విశేషాలు ఒక్కొక్కటిగా చెప్పడం మొదలుపెట్టాడు.
సినిమా షూటింగుల గ్రామాలు
మా ప్రయాణంలో కుడివైపు దెందూరు గ్రామం దగ్గర లాంచీ మొదటిగా ఆగింది. ఒడ్డున ఉన్న గండి పోచమ్మ ఆలయం చూసేందుకు పావుగంటసేపు లాంచీ ఆపారు. తర్వాత గైడ్‌ ఇక సినిమా కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. తీరంలో కనిపించే పూడిపల్లి అనే గ్రామంలో గ్రామీణ వాతావరణం ఉన్న సినిమాలు తీస్తారట! 'త్రిశూలం' సినిమాలో రావు గోపాలరావు ఇల్లు ఈ గట్టుమీదే కనిపిస్తుంది. అందాల రాముడు, ఆట, ఆపద్బాంధవుడు, ఇలా ఎన్నో సినిమాలు ఇక్కడ రూపు దిద్దుకున్నాయి.
అగ్గిపిడుగు అల్లూరి స్మృతులు
అక్కడ నుంచి నదిలో మరి కొంతదూరం ముందుకు సాగితే దేవీపట్నం గ్రామం ఒడ్డున కన్పించింది. అల్లూరి సీతారామరాజు లూఠీ చేసిన బ్రిటీష్‌ కాలం నాటి పాత పోలీస్టేషన్‌ భవనం. ఆ రెండు పక్కలా గులాబీ రంగు కొత్త పోలీసుస్టేషన్‌ భవనాలు, క్వార్టర్సు కన్పించాయి.
వస్తుమార్పిడి పద్ధతిలోనే
పాపికొండలు దగ్గరవుతున్న కొద్దీ కొండ మొదలు అనే గ్రామం తారసపడింది. అక్కడ ఏది కొనాలన్నా నాణేలు, నోట్లు చెలామణీలో ఉండవని, వస్తుమార్పిడి ద్వారానే ఇచ్చిపుచ్చుకోవాలని గైడ్‌ చెప్పడంతో చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ గ్రామం తర్వాత కొల్లూరు చేరాం. ఇక్కడ వెదురుతో పర్యావరణ సహితంగా నిర్మించిన ఎసి, నాన్‌ ఎసి కాటేజీలు ఉన్నాయి. వీటిని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. ఔత్సాహిక యాత్రికులు వాటిలో బస చేయొచ్చు. క్యాంప్‌ ఫైర్‌, గిరిజనుల నృత్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు.
పాపికొండలలో
ప్రయాణం ప్రారంభమైన ఐదు గంటలకు పాపికొండలు చేరుకున్నాం. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశమిది. వేసవిలో కూడా ఈ ప్రాంతం చల్లగానే ఉంది. పాపికొండల అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు, జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు ఉంటాయి. వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. అందువల్ల ఈ అడవుల్లోకి ఒంటరిగా అనుమతి లేకుండా ప్రయాణించడాన్ని నిషేధించారు.
ఘాట్‌ రోడ్డు కూడా
పాపికొండల వెనుక భాగానికి పశ్చిమగోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్‌ రోడ్డు మార్గం ఉంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరాసాగర్‌ ప్రాజెక్టు వలన ఈ ఘాట్‌ రోడ్డు మార్గం కనుమరుగుకానుంది.
పేరంటాలపల్లితో తుది మజిలీ

పాపికొండలు దాటిన తర్వాత సుమారుగా ఒక గంట ప్రయాణమయ్యాక వచ్చే ప్రదేశం పేరంటాలపల్లి గ్రామం. ఇది గతంలో ఖమ్మం జిల్లా పరిధిలో ఉండేది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో చేర్చారు. శ్రీరామగిరితో సహా రహదారి మార్గంలేని ఎన్నో గిరిజన గ్రామాలను అభయారణ్యాలను కలుపుకొని మూడు జిల్లాల సంగమమైన పాపికొండలతో మిళితమైన పేరంటాలపల్లి గ్రామం ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడే శ్రీరామకృష్ణ మునివాటం అనే ఆశ్రమం ఉంది. ఇందులోనే ఒక శివాలయం కూడా ఉంది. 1800లో రాజమండ్రి నుంచి ఒక ముని లాంచీపై బయలుదేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశాడట! ఆయన తనకు వచ్చిన కలకు అనుగుణంగా ఇక్కడే నివాసం ఉండి, ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు. గైడ్‌ ఈ ఆశ్రమ నియమాలను మాకు ముందే చెప్పాడు. ఇది గిరిజనుల నిర్వహణలోని ప్రదేశమని, అక్కడ వారికి సహాయం చేసే ఆలోచన ఉంటే ఆశ్రమ ప్రచురణలు కొనాలి తప్ప విరాళంగా, దానంగా డబ్బు, వస్తువులు ఇస్తే వాళ్ళు చాలా బాధపడతారని. ఆ ఆలయంలో పూజారి ఉండడు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పూజ చేసుకోవచ్చు. నైవేద్యం మాత్రం ఆశ్రమంలో వండిన పదార్థాలే పెట్టాలి. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే కొంచెం దూరం కొండమీదకు వెళ్లాల్సిందే. పరిసరాల్లో పచ్చని ఎత్తయిన కొండలపై నుంచి జాలువారే జలపాతాలను, గుడివెనుక రాళ్ల నుంచి పారే నీటి పరవళ్లు, ఇసుక తిన్నెలు, పిల్లలు, పెద్దలను కేరింతలు కొట్టిస్తాయి.
నోరూరించే బేంబూ చికెన్‌

ఎలాంటి కృత్రిమ పదార్థాలు కలపకుండా వెదురుబొంగుల్లో నాటు కోడి మాంసాన్ని ఉంచి నిప్పులపై కాల్చి తయారుచేసే బేంబూ చికెన్‌ పర్యాటకులకు నోరూరిస్తుంటుంది. ఈ పర్యటనకు వచ్చేవారు తప్పనిసరిగా ఈ చికెన్‌ టేస్ట్‌ చేయాల్సిందే. స్థానికంగా ఉన్న గిరిజనులు వెదురుతో తయారుచేసే వివిధ కళాకృతులు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. వాటన్నింటినీ ఆస్వాదిస్తూ ఇక్కడనుంచి మధ్యాహ్నం మూడు గంటలకి తిరుగు ప్రయాణం మొదలుపెట్టి, సాయంత్రం ఆరున్నర గంటలకి పట్టిసం, అక్కడనుంచి బస్సులో రాత్రి ఎనిమిది గంటలకు రాజమండ్రి లాంచీల రేవు చేరుకున్నాం.




ఇలా వెళ్లాలి

హైదరాబాద్‌ నుంచి పాపికొండలు 450 కి.మీ దూరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నగరానికి 60 కి.మీ దూరంలో ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడల నుంచి రాజమండ్రి వెళ్లడానికి బస్సు, రైలు, విమానం సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టిసం గ్రామానికి లేదా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురుషోత్తమపట్నం వరకు ట్రావెల్‌ ఏజెన్సీల బస్సులు, మినీ వ్యానుల్లో ప్రయాణం చేయాలి. గోదావరి నదిలో లాంచీలో పాపికొండలు యాత్ర మొదలవుతుంది. వీలైనంతవరకు ఉదయం తొమ్మిది గంటల లోపు అక్కడికి చేరుకోవాలి. అల్పాహారం, మధ్యాహ్న భోజనం లాంచీలోనే అందజేస్తారు. లాంచీ పేరంటాలపల్లి చేరుకోవటంతో యాత్ర ముగిసి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. పట్టిసం నుంచి పాపికొండలు యాత్ర, తిరుగు ప్రయాణ సమయం వాతావరణాన్ని బట్టి సుమారుగా పది గంటలు పడుతుంది.

PunnamiApTourism

పాపికొండ‌ల_న‌డుమ ప‌డ‌వ_ప్ర‌యాణం PunnamiApTourism Contact No :  9493365888, 9493375888 ఎటు చూసినా గోదావరి గలగలలు... కనుచూపు మ...